ఇదో టైమ్ పాస్ సినిమా రా... - అని కొన్ని సినిమాల్ని తేలిగ్గా తీసుకోవద్దు. టైమ్‌కిల్ చేసే సినిమాలొస్తున్న ఈ తరుణంలో పాస్ చేయించడం మామూలు విషయం కాదు. కాబట్టి అలాంటి సినిమాలకు కేవలం పాస్ మార్కులేసి సరిపెట్టకుండా.. సెకండ్ క్లాస్‌కు కాస్త ఇటూ అటూగా మార్కులేయొచ్చు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లా! ఈరోజుల్లో సినిమా టికెట్టు కంటే, దాన్ని చూసొచ్చిన పాపానికి తలనొప్పి టాబ్లెట్లకే ఎక్కువ ఖర్చవుతోంది. ఇలాంటి గోల సినిమాల మధ్య వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నిజంగా మేలు జాతి సినిమానే. చూసినంత సేపు నవ్వుకోవచ్చు. కాస్త థ్రిల్ ఫీలవ్వొచ్చు. మన టికెట్టు రేటు గిట్టుబాటయ్యే ఈ సినిమా స్పెషాలిటీ ఏంటీ? ఈ ఎక్స్‌ప్రెస్ స్పీడెంత?? రండి చూద్దాం.
సందీప్ (సందీప్ కిషన్) మంచోడే. అది అతని పేద్ధ మైనస్. ఎవరైనా గొడవ పడుతుంటే చూస్తూ ఊరుకోడు. మధ్యలో వెళ్లాడు. ఆ గొడవ ఇంటి వరకూ తీసుకొస్తాడు. నాన్న రామ్మూర్తి (నాగినీడు)కి ఇవన్నీ అస్సలు పడవు. పైగా ఆయన ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇంటినే స్కూల్ చేసేస్తారు. అందరూ క్రమ శిక్షణగా ఉండాల్సిందే. ఆయనకంటూ ఓ రాజ్యాంగం అమలు చేస్తాడు. ఎవరినైనా సరే, వంద తప్పుల వరకే క్షమిస్తాడు. ఆ తరవాత బయటకు గెంటేస్తాడు. ఇంట్లో అందరివీ సింగిల్ డిజిట్సే. కానీ సందీప్ స్కోరు మాత్రం 99. మరో తప్పు చేస్తే ఇంట్లోంచి వెళ్లిపోవాలి. ఆ ఒక్క తప్పు చేయకుండా ఎలా బయట పడాలా..? అని ఆలోచిస్తాడు. అంతలోనే అన్నయ్య పెళ్లి కుదురుతుంది. పెళ్లి తిరుపతిలో. కాచిగూడలో ఫ్యామిలీ అంతా రైలు ఎక్కుతుంది. కానీ సందీప్ మాత్రం మిస్ అవుతాడు. తన దగ్గర తాళిబొట్టు ఉండిపోతుంది. తెల్లారితే పెళ్లి. నాన్న తిరుపతి స్టేషన్‌లో కాలు పెట్టేలోగా.. తాళిబొట్టు తీసుకెళ్లాలి. తాను ఈ రైలు మిస్ అయ్యాడన్న సంగతి తెలియకూడదు. మరి వీటిని ఎలా మేనేజ్ చేశాడు? ఈ కథలోని ప్రార్థన (రకుల్ ప్రీత్ సింగ్) ఎలా ఎంట్రీ ఇచ్చింది. అనేదే ఈ సినిమా కథ.
అద్భుతమైన కథేం కాదు. కానీ.. స్ర్కీన్ ప్లే సరిగ్గా రాసుకోగలిగితే మంచి సినిమా అయ్యే ఛాన్సుంది. అందుకే కొత్త దర్శకుడు మేర్లపాక గాంధీ స్ర్కీన్ ప్లే విషయంలో దృష్టి పెట్టాడు. ట్రైన్ స్లోగానే మొదలువుతుంది. ఆ తరవాత పికప్ అందుకొంటుంది. ఈ సినిమా కూడా అంతే. ట్రైన్ ఎపిసోడ్ వరకూ ముందుకు వెళ్లాలా? వద్దా?? అన్నట్టుగానే వెళ్తుంది. ఆ తరవాత.. వేగం అందుకొంటుంది. సందీప్ ఆ రైలు అందుకొన్నాడా? లేడా? అనే విషయాలు ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు సఫలీకృతం అయ్యాడు. హీరో కాబట్టి క్షేమంగానే గమ్యం చేరుకొన్నాడనే విషయంలో ఎవరికీ ఎలాంటి డౌటూ వేయదు. కానీ ఎలా..?? అనే ఆసక్తి ఉంటుంది కదా. దాన్ని చక్కగా డీల్ చేసి చూపించాడు దర్శకుడు. ఈ సినిమాకి ప్రధానమైన బలం.. కామెడీ. ట్రైన్‌లో కొన్ని పాత్రల్ని సృష్టించి వాటి ద్వారా కామెడీని రన్ చేశాడు. ఓవైపు ట్రైన్‌ని ఛేజ్ చేస్తున్న హీరో, మరోవైపు రైలులో సప్తగిరి, అమృతం అప్పాజీ... పాత్రలు. ఈ రెండింటినీ లింకప్ చేయడం బాగుంది. దాంతో కావల్సినంత వినోదం రాబట్టుకొన్నాడు దర్శకుడు.
సందీప్ మరోసారి ఆకట్టుకొన్నాడు. పక్కింటి అబ్బాయి పాత్రలో ఇమిడిపోయాడు. ఎమోషనల్ సీన్స్ పండించేటప్పుడు దొరికిపోయాడు గానీ, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లో వేగం సరిగ్గా సరిపోయాయి. మరీ ఓవర్ హీరోయిజం చూపించలేదు. దాంతో.. మనం బతికి పోతాం. రకూల్ ప్రీత్ సింగ్ ఓకే అనిపిస్తుంది. ఓ పాటలో గ్లామరస్‌గా కనిపించింది. లోపాలు సరిదిద్దుకోగలిగితే... మరికొన్ని ఛాన్సులు అందుకోవడం ఖాయం. నాగినీడు, బ్రహ్మజీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, ఎమ్మెస్... వీళ్లందరి నుంచీ తనకు కావల్సిన నటన, కావల్సిన మోతాదులోనే రాబట్టుకొన్నాడు దర్శకుడు. తాగుబోతు రమేష్ మరోసాగి తాగి, తూలి నానా హడావుడి చేశాడు. రమణ గోగుల సంగీతం అందించిన ఈ సినిమాలో రెండే రెండు పాటలున్నాయి. అవి లేకపోయినా ఫర్లేదు. కానీ.. నిడివిని దృష్టిలో ఉంచుకొని పాటల్ని జోడించారు. ఆర్.ఆర్... సరిపోయింది. అన్నింటికంటే ఎక్కువ మార్కులు చోటాకు పడతాయి. తన మేనల్లుడి సినిమాని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. సెకండాఫ్‌లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది.
ఫస్టాఫ్ లో ఉన్నంత వేగం సెకండాఫ్‌లో లేదు. ఎంటర్‌టైన్ కూడా మిస్సయ్యింది. ఎమోషనల్ సీన్స్‌ని బాగా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు. నాగినీడిలో వచ్చిన మార్పు మరీ డ్రమటిక్‌గా ఉంది. అసలు ఏ తండ్రయినా కొడుకు తప్పుల్ని లెక్క పెట్టుకొంటూ కూర్చుంటాడా?? మరో తప్పు చేయకు అంటాడు గానీ, నువ్వు నలభై నాలుగు తప్పులు చేశావ్. ఇంకో అరవై ఆరు వరకూ భరిస్తా.. అని లెక్కలేసుకొంటాడా? ఇలా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాం అనుకోకపోతే, అసలు కాన్సెప్ట్‌లోనే తప్పుంది. సరేలే.. అని వదిలి చూస్తేనే ఈ సినిమాని చూడగలం.
No comments:
Post a Comment