కేంద్ర హోం మంత్రి షిండే ఈరోజు ముగిసిన
జీఓఎం సమావేశం అనంతరం మాట్లాడుతూ రాష్ర్ట విభజన విషయంలో జీవోఎం కసరత్తు
పూర్తయ్యిందని.. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని
చెప్పారు. అయితే చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు ఉంటాయని.. అసలు
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యేకాదని.. విభజనతో ఏ ఒక్కరూ ఇబ్బంది
పడొద్దనేదే తమ ఉద్దేశ్యమన్నారు.
అయితే షిండే అన్నట్లు అసలు హైదరాబాద్..
భద్రాచలం అధిష్టానం దృష్టిలో సమస్యేలే కావా? అసలు హైదరాబాద్ మీద ఎవరూ
ఒత్తిడి తీసుకురాలేదా? లేక ఒత్తిడి వచ్చినా ఆ దిశగా తాము ఆలోచించలేదు కనుక
అది మంత్రుల బృందంకు పెద్ద విషయంగా అనిపించలేదా? అనేది అర్ధం కాని విషయాలు.
గతంలో సమైక్యం అన్నవారంతా ఇప్పుడు హైదరాబాద్ యుటి అయితే చాలని సంతృప్తి
పడిపోతున్నారు.
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా
మార్చడం పైనే ఇప్పుడు రాజకీయ నాయకుల దృష్టి వుంది. సీమాంధ్రకు చెందిన
నాయకులు ప్రతి ఒక్కరు ఇప్పుడు విభజనకు మానసికంగా సిద్దమై హైదరాబాద్ మీదనే
బెట్టు చేస్తున్నారు. అలాంటిది అధిష్టానం పట్టించుకోక అది సమస్య కాదని
తీసిపారేస్తుందని అనుకోవాలేమో షిండే మాటలను బట్టి. ఇక భద్రాచలం వ్యవహారం
కూడా ఇలాంటిదే. నిజానికి ప్రస్తుతం సీమాంధ్ర నేతలందరూ ఢిల్లీలో బిజీగా
ఉండగా కేవలం తెలంగాణా నేతలే భద్రాచలం డిమాండ్ వినిపిస్తున్నారు. రేపు
ఎక్కడైనా తేడా వస్తే కనుక ఇరు ప్రాంతాల నేతలు ఈ విషయం మీదనే రాజకీయం
చేస్తారు. మరి దీనిని కూడా షిండే సాబ్ లైట్ తీసుకున్నారా? అంటే ఆశ్చర్యమే
మరి!

No comments:
Post a Comment