హిట్టూ, ఫ్లాపూ అనే విషయాలు పక్కన పెట్టండి. ప్రతీ సినిమాకీ ఓ ప్రాధమిక సూత్రం ఉండి తీరాలి. రెండుగంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలగడం. రెండో సీన్ నుంచే విసుగు, ఇంట్రవెల్ వచ్చేసరికి విరక్తి, శుభం కార్డు పడేటప్పటికి సహనం నశించి తెర చించేయాలన్నంత కోపం వస్తే.. అలాంటి సినిమాల్ని ఏమనాలి..? పూర్వ కాలంలో ఏమనేవాళ్లో తెలీదు. ఈ క్షణంలో మాత్రం అలాంటి సినిమాని ఆడు మగాడ్రా బుజ్జీ అనాలి. సినిమాకి కథ కావాలి, సన్నివేశాలు బాగా రాసుకోవాలి, తెరపై అద్భుతాలు చూపించాలి - ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజుల్లో సినిమా ఇంత గొప్పగా ఉండక్కర్లేదు. జస్ట్ టైమ్ పాస్ చేస్తే సరిపోతుంది. ఇంటికి గొప్ప అనుభూతులు మోసుకెళ్లవలసిన అవసరం లేదు. థియేటర్లో ఉన్నంత సేపైనా ఇంటి గురించి మర్చిపోతే చాలు. కనీసం ఈ లక్షణం కూడా లేకపోతే.. ఆ సినిమా ఆడు మగాడ్రా బుజ్జీనే.
సిద్ధు ( సుధీర్ బాబు ) చిన్నప్పటినుంచే అల్లరి పిల్లాడే. తన సంతోషం కోసం అందరితోనూ ఆడుకొంటుంటాడు. తండ్రి( సీనియర్ నరేష్ )ని సైతం ముప్పు తిప్పలు పెడుతుంటాడు. కాలేజీలో చదువుకొంటున్న ఇందు (అస్మితా సూద్ ) ప్రేమలో పడతాడు. కానీ అతని ప్రేమకు ఇందు అన్నయ్య చెర్రీ ( రణధీర్ ) అడ్డొస్తుంటాడు. చెర్రీ దృష్టి మరల్చడానికి అంజలి ( పూనమ్ కౌర్)ని వాడుకొంటాడు. అంజలి ప్రేమలో చెర్రీని పడేస్తాడు. మరోవైపు రాజకీయంగా ఎదిగేందుకు ఎంతకైనా తెగిస్తుంటాడు బుజ్జి ( అజయ్ ). బుజ్జీ మేనకోడలే.. అంజలి. తాను పెళ్లి చేసుకోవాలనుకొంటున్న అంజలిని చెర్రీ ప్రేమిస్తున్నాడని తెలిసి అతనిపై దాడి చేస్తాడు. తన వల్ల చెర్రీకి జరిగిన కష్టం చూసి తట్టుకోలేని సిద్దూ .. బుజ్జీపై రివైంజ్ తీర్చుకోవడానికి ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? బుజ్జీని సిద్దూ ఎలా చెడుగుడు ఆడుకొన్నాడు? ఇవన్నీ తెరపై చూసి తరించాల్సిందే.
దర్శకులు ఇప్పుడు సేఫ్ జర్నీపైనే దృష్టి పెట్టారు. కొత్తగా ఆలోచిస్తే కొంపలు అంటుకుపోతాయేమో అనుకొని.. అలవాటైన ఫార్ములా పట్టుకొని వేళాడుతున్నారు. ఢీ, రెడీ, దూకుడు, దూసుకెళ్తా, దేనికైనా రెడీ - విలన్ ఇంట్లో హీరో చేరి అతనితో చెడుగుడు ఆడుకొనే సినిమాలు. ఈ జాబితాలో ఈ మగాడు కూడా చేరిపోతాడు. ఒక్క ఫార్ములా హిట్ అయితే.. దాని చుట్టూ కథలు అల్లుకోవడం అనే సంస్ర్కృతి నుంచి మన దర్శకులు ఎప్పుడు బయటపడతారో వాళ్లకే తెలియాలి. ఆడుమగాడ్రా బుజ్జీ కూడా మనం చూసీ చూసీ విసిగిపోయిన లైనే. కొత్త దర్శకుడు కృష్ణారెడ్డి కూడా దాన్నే పట్టుకొని రెండున్నర గంటల లాగడానికి ట్రై చేశాడు. ఈ కథలో కామెడీ ఉంటుంది.. నవ్వు రాదు. ఫైట్లు ఉన్నాయ్. అందులో ఎమోషన్స్ లేవు. ట్విస్టులు ఉన్నాయి.. చూడ్డానికి ఇంట్రస్ట్ ఉండదు. పాటలున్నాయి. ప్లేస్ మెంట్ కుదర్లేదు. సిక్స్ ప్యాక్ ఉంది. దానికి ఉపయోగం లేదు. అలా అన్నిటా వృథా ప్రయాసే.
సుధీర్ బాబులో ప్లస్ ల కంటే మైనస్ లు బాగా కనిపించాయ్. డాన్సుల్లో అతను సూపరే. అందులో ఈ సినిమాతో నిరూపించుకోవడానికి ఏమీ లేదు. ఇందులోనూ తన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. ఐటెమ్ పాటలో అతను వేసిన స్టెప్ హైలెట్. కాకపోతే చాలా సందర్భాల్లో దొరికిపోయాడు. డైలాగ్ పలికేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. అతని గొంతు సహకరించడం లేదు. బాడీ భీకరంగా ఉంటుంది. గొంతు మాత్రం పేలవంగా వినిపిస్తుంది. ఇందేం కాంబినేషనో ఏమో..? ఇక హీరోయిన్ శుద్ధ దండగ. సుధీర్ బాబు అక్కయ్య పాత్రలకైతే పర్‌ఫెక్ట్ గా సరిపోతుందేమో..? మిగతావాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. సుమన్ లాంటి సీనియర్లను సరిగా వాడుకోలేదు. సీనియర్ నరేష్ ఫర్వాలేదనిపిస్తాడంతే.
ఈ సినిమాలో ఉన్న ఏకైన ఉపశమనం కుక్క పాత్ర. శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలో ఓ కుక్క మనుషులపై సెటైర్లు వేస్తుంటుంది. ఇందులో కుక్క కామెడీ చేస్తుంటుంది. సినిమా అంతా ఈ కుక్క కనిపిస్తుంది. నవ్విస్తుంది. పోలీస్ స్టేషన్‌లో సన్నివేశం కూడా బాగానే పేలింది. ఇవి మినహాయిస్తే పెద్దగా మెరుపులేం లేవు ఈ సినిమాలో. సెకండాఫ్ మరీ శిరోభారం. సినిమాని గబగబ పరిగెట్టిస్తున్న ఫీలింగ్‌లో దర్శకుడు కథనాన్ని చిందర వందర చేశాడు. సందర్భం లేకుండా వచ్చే పాటలు.. చికాకు పెడతాయి. పతాక సన్నివేశాల్లోనూ హడావుడే. అప్పటి వరకూ అక్కడక్కడే తిరిగిన కథ... సడన్‌గా క్లైమాక్స్‌కి చేరిపోతుంది. శ్రీ సంగీతం ఓకే. పాటలు క్యాచీగా లేకపోయినా చూడ్డానికి బాగానే ఉన్నాయి. ఛాయాగ్రహణం బాగుంది. ఎడిటింగ్ మాత్రం ఇంకా షార్ప్‌గా పనిచేయాల్సింది. తాను తీసిన సన్నివేశాలపై నమ్మకం పెరిగిపోయి.. ఎడిట్ చేయడానికి ఒప్పుకోలేదేమో..?
మొత్తమ్మీద ఇదో సాదాసీదా చిత్రం. రొటీన్ కథని కొత్తగా మలచడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. పాయింట్ లో.. సినిమా తీతలో కొత్తదనం లేకపోవడంతో టికెట్టు రేటు ఏమాత్రం గిట్టుబాటు కాదు.
రేటింగ్: 1.5

No comments:
Post a Comment